కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును ఏడాదిలోగా పూర్తిగా తరలిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను ఒక్క రోజులో తరలించడం సాధ్యం కాదన్నారు. బుధవారం డంపింగ్ యార్డ్ ప్రాంతంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి పొన్నం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కరీంనగర్‌కు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న డంపింగ్ యార్డును తరలించాలని కోరినట్లు గుర్తు చేశారు.
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో వేస్ట్ మేనేజ్‌మెంట్ విషయంలో గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటనలో డంపింగ్ యార్డ్ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున డంపింగ్ యార్డ్‌ను పరిశీలించినట్లు తెలిపారు. పెద్ద నగరాల్లో చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణ ప్రధాన సమస్యగా మారిందని పేర్కొన్నారు.
కరీంనగర్ నుంచి తరలించే డంపింగ్ యార్డును వరంగల్–కరీంనగర్ మధ్యలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రోజూ వచ్చే చెత్తను ఎలా నిర్వహించాలి, ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను ఎలా తరలించాలి అనే అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. చెత్త తరలింపునకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ అంజన్ కుమార్, పలువురు కార్పొరేటర్లు
పాల్గొన్నారు.
